బాహుబలి ముందు `టైగర్` వెనుకడుగు!







బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో అన్న క్యూరియాసిటీని ప్రపంచవ్యాప్తంగా రేకెత్తించిన దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి-2తో పలు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా `బాహుబలి-2` తొలిరోజు `బాక్సాఫీస్ ` కలెక్షన్లకు బాలీవుడ్ బెంబేలెత్తిపోయింది. ఒక దక్షిణాది చిత్రానికి దక్కిన తొలిరోజు కలెక్షన్ల రికార్డును ఎలాగైనా బద్దలు కొట్టాలని కంకణం కట్టుకుంది. అయితే ఈ ఏడాదికి మాత్రం ఆ కలలన్నీ...కల్లలుగానే మిగిలిపోయాయి.  ఇప్పటివరకు విడుదలైన బాలీవుడ్ చిత్రాలేవీ బాహుబలి-2 తొలిరోజు కలెక్షన్ల దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాయి. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ డిజాస్టర్ మూవీ ట్యూబ్ లైట్ తర్వాత భారీ అంచనాల నడుమ విడుదలైన 'టైగర్ జిందా హై' చిత్రం కూడా ఆ రికార్డును అధిగమించలేకపోయింది.

సల్లూ భాయ్ తాజా చిత్రానికి మంచి టాక్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 5700ల థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం 'బాహుబలి 2' రికార్డును బద్దలు కొడుతుందని బాలీవుడ్ సినీ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ సల్లూ భాయ్ చిత్రం కేవలం రూ. 33.75 కోట్లు కలెక్ట్ చేసి రెండో స్థానంలో నిలిచింది. బాహుబలి-2 హిందీ వెర్షన్ తొలి రోజు రూ. 41 కోట్లతో టాప్ ప్లేస్ లో నిలిచింది. 2017కు గానూ బాక్సాఫీస్ ను షేక్ చేసిన టాప్ 5 చిత్రాల జాబితాను బాలీవుడ్ ఫిల్మ క్రిటిక్ - ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. 'బాహుబలి 2' - 'టైగర్ జిందా హై' చిత్రాల తర్వాత 'గోల్ మాల్ అగైన్' (రూ. 30.14 కోట్లు) - 'ట్యూబ్ లైట్' (రూ. 21.15 కోట్లు) - 'రాయిస్' (రూ. 20.42 కోట్లు) చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ లో బాహుబలి-2 రికార్డును బద్దలు కొట్టే చిత్రమేమీ కనబడడం లేదు. వివాదాల నడుమ విడుదల వాయిదా పడ్డ పద్మావతి చిత్రం పై బాలీవుడ్ భారీ అంచనాలు పెట్టుకుంది. ఆ హిస్టారికల్ మూవీ ...బాహుబలి-2 రికార్డును బద్దలుకొడుతుందేమో వేచి చూడాలి.










కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు